● బాధ్యతగా విధులు నిర్వహించండి
● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు బాధ్యతను హక్కుగా భావించి విధులు నిర్వహించినప్పుడే సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. డిపో ఎదుట కార్మికులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తెచ్చామన్నారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చించి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా వారధిగా ఉంటానని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, ఏసీపీ సదానందం, డిపో మేనేజర్ వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


