గుర్రాలగొందిని సందర్శించిన ట్రెయినీ డీపీఓలు | - | Sakshi
Sakshi News home page

గుర్రాలగొందిని సందర్శించిన ట్రెయినీ డీపీఓలు

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

సిద్దిపేటరూరల్‌: నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామాన్ని ట్రెయినీ డీపీఓలు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో అమలవుతున్న గ్రామస్థాయి మంత్రివర్గ పనితీరు, రుతుప్రేమ, స్టీల్‌బ్యాంకు నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ స్వప్న గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వంటి వాటిని అధికారులకు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ గ్రామ వార్డు సభ్యులు మంత్రివర్గం మాదిరిగా శాఖలను కేటాయించుకుని సమస్యలు పరిష్కరించుకోవడం బాగుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ డీపీఓ అనూష, సిద్దిపేట డీపీఓ వినోద్‌, జగిత్యాల ట్రెయినీ డీపీఓ రేవంత్‌, వనపర్తి ట్రైనీ డీపీఓ తరుణ్‌చక్రవర్తి, డీఎల్‌పీఓ చందన, ఎంపీఓ విష్ణు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు అధైర్యపడొద్దు

ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదు

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదని సీపీ రష్మీ పెరుమాళ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పిల్లలను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చవద్దని వారిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఫలితాల తర్వాత పిల్లలు మౌనంగా ఉన్నా, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించాలని సూచించారు. ఓటమి అనేది తాత్కాలికమని, విద్యార్థులకు జిల్లా పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సహాయం కోసం ఏ సమయంలోనైనా సిద్దిపేట పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 8712667100 లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.

కార్మిక చట్టాలపై

అవగాహన అవసరం

సిద్దిపేటరూరల్‌: కార్మిక చట్టాలపై అవగాహనతో పాటు హక్కులను కాపాడుకోవాలని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌ఓ నాగరాజమ్మ , అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌లు అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రతీ కార్మికుడికి కనీస వేతనం అందేలా చూడడం, అదనపు వేతనం పొందే హక్కు, భద్రతా ప్రమాణాలు, భీమా సౌకర్యం తదితర పొందేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మిక కార్డు, ఈశ్రమ్‌ కార్డులను దరఖాస్తు చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను పొందాలన్నారు. కార్మిక ప్రయోజనాలు పొందేందుకు కార్మిక కార్యాలయాన్ని, మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అనంతరం కార్మిక చట్టాలు, ప్రయోజనాల వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట దగ్ధం

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని శుక్రవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. హార్వెస్టర్‌ నడిపిస్తుండగా బెల్ట్‌ నుంచి నిప్పు రవ్వలు రావడంతో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. ఈ సంఘటనలో కొండల్‌రెడ్డి, హనుమంతరెడ్డి, రాజయ్యలకు చెందిన మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా పంటలు అధిక శాతం కాలిపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా వేడుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement