సింహవాహనంపై నాచగిరీశుడి విహారం | - | Sakshi
Sakshi News home page

సింహవాహనంపై నాచగిరీశుడి విహారం

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

వర్గల్‌(గజ్వేల్‌): స్వాతి నక్షత్రం వేళ నృసింహావిర్భావం.. సింహవాహనంపై స్తంభోద్భోవుని దివ్యదర్శనం ఆవిష్కృతమైంది. నృసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నాచగిరి భక్తిపారవశ్యమైంది. జయంతి ఉత్సవాలలో భాగంగా విశేష అభిషేకం, సుదర్శన నారసింహ మూలమంత్ర హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అష్టోత్తర శతకలశ పూజ జరిపారు. భక్తజన హర్షధ్వానాల మధ్య సింహవాహనంపై శ్రీవారు ఊరేగారు. అనంతరం స్తంభోద్భవుడు నృసింహుని ఆవిర్భావ ఘట్టంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి

మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడం కోసం దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిదిలోని లింగుపల్లిలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్‌పర్సన్‌ బొమ్మెర సంయుక్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన తాగు నీరు, నీడ, వంటి వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.

కోదండరాంను కలిసిన

టీజేఎస్‌ నాయకులు

గజ్వేల్‌రూరల్‌: ప్రొఫెసర్‌ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా టీజేఎస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీజేఎస్‌(తెలంగాణ జన సమితి) జిల్లా ఇన్‌ఛార్జి రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి గురువారం కోదండరాంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల నష్టపరిహారం తదితర అంశాలను కోదండరాం దృష్టికి తీసుకెళ్లి ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

మంత్రి ఇలాకాలో ఏఈ ఏరీ?

హుస్నాబాద్‌: రూ.కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్న మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ఏఈ (అసిస్టెంట్‌ ఇంజినీర్‌)ని నియమించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌గౌడ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ డివిజన్‌ కన్వీనర్‌ కవ్వ వేణుగోపాల్‌రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఇలాకాలో పూర్తి స్థాయి ఏఈ లేకపోవడం దారుణమన్నారు. సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడం, క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడేళ్లకే గుంతలు పడి కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement