ధైర్యం వీడొద్దు.. ఆత్మస్థైర్యం మరవొద్దు
సిద్దిపేటకమాన్: విద్యార్థుల అనాలోచిత నిర్ణయాల వల్ల విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ర్యాంకులు, మార్కుల విషయంలో తోటివారితో పోలికలు ఒత్తిడిలోకి నెడుతున్నాయి. విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. ర్యాంకుల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థుల బలవన్మరణాల ఫలితంగా రేపటి భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలవగానే తాము అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని, ఫెయిల్ అవుతామని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. పరీక్షలు మళ్లీ రాసి గెలవాలే గానీ క్షణికావేశంలో జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. మార్కుల పట్ల ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారి జీవితం అత్యంత ప్రాధాన్యమైనదని గుర్తించాలి.
‘చిన్న’కోడూరుకు ‘పది’ంతల కీర్తి
ఆత్మహత్య పరిష్కారం కాదు
విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో క్షణికావేశంలో విలువైన ప్రాణాలు తీసుకోకూడదు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి. అంతేకాని అనాలోచిత నిర్ణయాల వల్ల జీవితాన్ని కోల్పోవద్దు. విద్యార్థులు ఏవరైనా ఒత్తిడికి లోనైతే తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకవస్తా.
– డాక్టర్ శాంతి, మానసిక వైద్య నిపుణురాలు, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి


