● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడరూరల్(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడ మండల కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంజనీరింగ్ కళాశాలలో
అన్ని వసతులు కల్పిస్తాం
హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మండలంలోని ఉమ్మాపూర్‌లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్ధలాన్ని పరిశీలించి స్థల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. విద్యార్థి, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం గాంధీనగర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఒకటిన్నర ఎకరాల్లో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) ఏర్పాటు కోసం సంబందిత అధికారులకు స్థలం అప్పగించామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, ఏటీసీ కేంద్రం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అలాగే కూచనపల్లి, మాలపల్లె మధ్య న్యాక్ సెంటర్ మంజూరు కాగా స్థలాన్ని పరిశీలించారు. విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం మెరుగుపడాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు.


