● టాపర్స్‌కు త్వరలో ఐ ప్యాడ్స్ ● మాజీ మంత్రి హరీశ్‌రావు ● విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్
సిద్దిపేటజోన్: ‘పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాం. అందరికీ అభినందనలు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన చిన్నకోడూరు మండల ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు. పదిలో ఉత్తీర్ణత సాధించిన మీ పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదివి, ఉన్నతంగా ఎదగాలి అనేది నా తాపత్రయం, నా ప్రయత్నం అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,874మంది విద్యార్థులు పది పరీక్ష రాయగా 2,791మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇదే పట్టుదలతో చదివి భవిష్యత్తుకు మంచి లక్ష్యం ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. అదేవిధంగా నంగనూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావు పేటలకు త్వరలో బెస్ట్ 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్స్ గిఫ్ట్‌గా ఇస్తానని, అదేవిధంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు.


