ధాన్యం లారీలకు జీపీఎస్
జీపీఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనంలో ధాన్యం బస్తాల లోడింగ్
మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు.. పంపిన ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్, ఆన్‌లైన్‌లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీ అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ సీజన్ నుంచే నూతన పద్ధతులను పౌరసరఫరాల శాఖ అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందు కోసం 419 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
అక్రమాలను అరికట్టేందుకే..
ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్‌లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది.. ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్ల పై చర్యలు తీసుకుంటారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పని చేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనన్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్లు జనరేట్, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడికి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు దాదాపు 48 గంటల్లో ధాన్యం డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి.
‘పలుకుబడి’కి ఇక చెల్లు
ఇదివరకు సివిల్ సప్లయ్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించే వారు. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్‌గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్‌గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపివేసింది. కొత్త విధానంలో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్‌లైన్‌లో జనరేట్ చేసిన తర్వాతే అదే ఆటోమేటిక్‌గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్‌షీట్‌లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాలి.
నూతన పద్ధతిలోనే
మిల్లులకు కేటాయింపులు
అన్‌లోడింగ్ జాప్యానికి చెక్
రైతులకు త్వరగా డబ్బు చెల్లింపులు
జిల్లా వ్యాప్తంగా 5లక్షల
మెట్రిక్ టన్నుల సేకరణ..
పారదర్శకత కోసమే..
మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరితగతిన రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్‌లోడింగ్ జాప్యం సైతం తగ్గనుంది. – గోపికృష్ణ,
డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్


