వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో స్వామివారి జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ఉదయం 7.30 గంటలకు యాగశాల ప్రవేశం జరిగింది. అర్చకస్వాములు మంత్రోచ్ఛరణలతో మూర్తికుంభ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన కుండానికి అదనంగా మరో మూడు కుండాలు ఏర్పాటుచేసి సుదర్శన నారసింహ మూలమంత్ర హవనములు నిర్వహించారు. పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం హవనాది కార్యక్రమాలు కొనసాగాయి. ఉత్సవాలలో ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ధర్మకర్తలు శ్రీనివాస్, భక్తులు హోమంలో పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మల్లన్న ఆలయంలో
వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో మంగళవారం పలు దుకాణాల నిర్వహణకు ఈఓ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో పూజా సామగ్రి విక్రయించే లైసెన్సు హక్కును కొమురవెల్లికి చెందిన చిక్కుడు స్వామి దక్కించుకున్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్‌లోని షాప్ నెం.15ను రూ.88వేలకు ఎల్. నరేందర్, అన్నదాన సత్రం ఎదుట ఉన్న షాప్ నెం. నాలుగును రూ.65,500 కె.మహేశ్ దక్కించు కున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు సుదర్శన్, శ్రీను పాల్గొన్నారు.
ప్రైవేటీకరణపై
నిర్ణయం తీసుకోలేదు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్
మున్సిపల్ చైర్‌పర్సన్ చందన
గజ్వేల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణ వ్యవస్థను ప్రైవేటీకరించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ దుకాణాల వద్ద మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన తెలిపారు. కొన్ని రోజులుగా చెత్త సేకరణపై వస్తున్న విమర్శలపై మంగళవారం స్పందించారు. మున్సిపాలిటీలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ విలీనం కావడం వల్ల గతంలో అక్కడి పంచాయతీల్లో పనిచేసిన 32మంది పారిశుద్ధ్య సిబ్బంది.. ఇక్కడికి బదిలీ అయ్యారన్నారు. దీంతో చెత్త వాహనాల డీజిల్ ఖర్చులు, సిబ్బంది వేతనాలు భారంగా మారాయన్నారు. పరిస్థితులను సమతుల్యం చేసుకోవడానికి మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల అనుమతితోనే తదుపరి చర్యలు చేపడతామని, ఈవిషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
సజ్జనార్‌ను కలిసిన లింగాయత్ నేతలు
గజ్వేల్: పోలీస్‌శాఖ డీజీగా పదోన్నతి పొందిన వీసీ సజ్జనార్‌కు గజ్వేల్, చేర్యాల ప్రాంతాలకు చెందిన వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయనను కలుసుకొని పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు అకుల ప్రశాంత్, కాసని వీరేశం, కొత్తపల్లి శ్యామ్‌కుమార్, మధుసూదన్, రమేశ్, రాకేశ్, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ పెంచాలని కోరారు. గతంలో అనేక సార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దివ్యాంగులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.


