చదువుతోనే ఉన్నత స్థానం | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే ఉన్నత స్థానం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదువొక్కటే మార్గమని కలెక్టర్‌ హైమావతి అన్నారు. మంగళవారం మిరుదొడ్డిలోని మోడల్‌ స్కూల్‌లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం, వాటి నివారణ చర్యలు, సైబర్‌ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేరీర్‌ గైడెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. విద్యారంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడటానికి అవకాశాలు వస్తాయన్నారు. జీవితంలో ఓటమి అనేది విజయానికి దారి చూపుతుందన్నారు. నిరాశపడకుండా నిబద్ధతతో పని చేస్తేనే విజయం వరించడమే కాకుండా పది మందికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. కష్టాల సుడిగుండంలో పెరిగి ఉన్నత చదువులు చదివి శాస్త్రవేత్తగా ఎదిగి, అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టిన డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి ఆరోగ్యం, చదువు, భద్రతపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పాజిటివ్‌ ఎనర్జీ రావాలంటే యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారి శారద, డీఆర్డీఓ జయదేవ్‌ ఆర్య, సీడీపీఓ రాము, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్‌ బాబు, ఎంపీడీఓ గణేష్‌రెడ్డి, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అర్చన ప్రియదర్శిని, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం సందర్శన

మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. కొనుగోలు కోసం రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించామని, వారి నుంచి అనుమతులు రాగానే కొనుగోళ్లు చేపడతామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు చేయండి

సాక్షి, సిద్దిపేట: నీట్‌– 2026 ఆఫ్‌లైన్‌లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ హైమావతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మే 3న నీట్‌–2026 పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 937 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం సెంటర్‌లో సీసీ కెమెరాలు, పవర్‌ సప్లయ్‌, విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను, సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. అలాగే రెండు సెంటర్ల చుట్టూ 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

కలెక్టర్‌ హైమావతి

Advertisement
 
Advertisement
Advertisement