సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలవుతున్న ఎర్లీబర్డ్ పథకం ఆఫర్ గడువు ముంచుకొస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఇస్తోంది. ఇది వరకు బకాయిలు లేని వారు ఈ పథకానికి అర్హులు. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలనే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఐదు మున్సిపాలిటీల్లోని 69,709 నివాస గృహాలకు గాను కేవలం 8,705మంది మాత్రమే వినియోగించుకున్నారు.
26 రోజుల్లో..
జిల్లా వ్యాప్తంగా రూ.35.12కోట్ల లక్ష్యానికి ఎర్లీబర్డ్ పథకం కింద 26 రోజుల్లో రూ.4.96 కోట్ల వసూలుతో 14.29శాతం నమోదు అయింది. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను వసూలు లక్ష్యం అనంతరం ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే ఒకేసారి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికి 2026–27 ఆర్థిక సంవత్సర పన్నులో ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల్లో హోర్డింగ్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం తెచ్చారు. గత ఏడాది ఎలాంటి ఆస్తిపన్ను బకాయిలు లేని వారికి ఈ పథకం కల్పించారు. మరోవైపు ఆర్థిక ఆస్తిపన్ను లక్ష్యం అధిగమించేందుకు ఎర్లీబర్డ్ పథకం బల్దియాలకు ఎంతో ఉపయోగం కానుందని ప్రభుత్వం సంకల్పించింది. సిద్దిపేట మున్సిపాలిటీలో అత్యధికంగా రూ.3.82కోట్లు ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తిపన్ను చెల్లించగా, అత్యల్పంగా చేర్యాలలో కేవలం రూ.12లక్షలే వసూలయ్యాయి.
ఆఫర్ మరో నాలుగు రోజులే
ఇప్పటివరకు రూ.4.96 కోట్లు వసూలు
సద్వినియోగం చేసుకున్నది8,705 మందే
అత్యధికంగా సిద్దిపేట.. అత్యల్పం చేర్యాల


