‘కో–ఆప్షన్‌’పై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

‘కో–ఆప్షన్‌’పై ఉత్కంఠ

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

గజ్వేల్‌: ‘కో–ఆప్షన్‌’ సభ్యుల ఎన్నికపై గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. నాలుగు కో–ఆప్షన్‌ స్థానాలు ఉండగా, ఇందులో మైనార్టీలకు రెండు(మహిళ, జనరల్‌), మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు(మహిళా, జనరల్‌) కేటాయించిన సంగతి తెల్సిందే. ఈ పదవులకు 40మంది దరఖాస్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఎన్నిక ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కమిషనర్‌ సెలవులో ఉన్న కారణంగా.. దరఖాస్తుల స్క్రూటీని చేయలేదు. ఎన్నికకు సంబంధించి తేదీ నిర్ణయం జరగలేదు. ఒకటిరెండ్రోజుల్లో కమిషనర్‌ విధుల్లో చేరే అవకాశం ఉండగా, స్క్రూటీని ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికకు రంగం సిద్ధం చేయనున్నారు.

బీఆర్‌ఎస్‌లో కసరత్తు

మున్సిపాలిటీని కై వసం చేసుకున్న బీఆర్‌ఎస్‌.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిలు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరుపుతున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌తోపాటు పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. గత పాలకవర్గంలో ‘సీల్డ్‌ కవర్‌’ పంపిన తర్వాత కూడా.. చివరి క్షణంలో కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి ఎన్నిక చేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బీఆర్‌ఎస్‌ జాగ్రత్త పడుతోంది. కాకపోతే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఎంపిక పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ప్రాధాన్యతల మేరకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.

పోటీలో కాంగ్రెస్‌ నేతలు...

కో–ఆప్షన్‌ పదవుల కోసం కాంగ్రెస్‌కు చెందిన నేతలు సైతం పోటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలోని 20కౌన్సిలర్‌ స్థానాల్లో 11మంది బీఆర్‌ఎస్‌, ఒకరు ఇండిపెండెంట్‌, ఏడుగురు కాంగ్రెస్‌, మరొకరు బీజేపీ కౌన్సిలర్‌ ఉన్న తెల్సిందే. ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ సైతం బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో వారి సంఖ్య 12కు చేరింది. ఈ క్రమంలో ‘కో–ఆప్షన్‌’ సభ్యుల ఎన్నికకు చేతులెత్తే విధానంలో అభ్యర్థులకు మద్దతు పలకాల్సి ఉంటుంది.

ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, సీనియర్‌ నాయకులు ఎలాగైనా ‘కో–అప్షన్‌’ పదవులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కొందరు పట్టణంలో తమ రాజకీయ ఉనికికి పరీక్షలా భావించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తాము అభ్యర్థుల గెలుపునకు పనిచేశామని.. బీఆర్‌ఎస్‌ అధిష్టానం తమను గుర్తించాలని నేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు నేతలు ఖర్చుకు సైతం సిద్ధమవుతుండటం గమనార్హం.

పోటీలో 40మంది ఆశావహులు

నేటికీ పూర్తికాని దరఖాస్తుల స్క్రూటీని

ఎన్నికకు తేదీ నిర్ణయంలో జాప్యం

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో పరిస్థితి

Advertisement
 
Advertisement
Advertisement