● 11 రోజుల్లో ముగియనున్నపాలకవర్గం పదవీకాలం ● ఈనెల 30న చివరి కౌన్సిల్‌ సమావేశం ● వార్డుల పెంపు, ఎన్నికలపై సర్వత్రా చర్చ | - | Sakshi
Sakshi News home page

● 11 రోజుల్లో ముగియనున్నపాలకవర్గం పదవీకాలం ● ఈనెల 30న చివరి కౌన్సిల్‌ సమావేశం ● వార్డుల పెంపు, ఎన్నికలపై సర్వత్రా చర్చ

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

● 11 రోజుల్లో ముగియనున్నపాలకవర్గం పదవీకాలం ● ఈనెల 30న చివరి కౌన్సిల్‌ సమావేశం ● వార్డుల పెంపు, ఎన్నికలపై సర్వత్రా చర్చ

సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం మరో 11 రోజుల్లో ముగియనుంది. ‘పుర’ పాలనకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మే 7వ తేదీతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీ నేతలు, పట్టణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.

– సాక్షి, సిద్దిపేట

సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు ఏప్రిల్‌ 30, 2021న ఎన్నికలు జరగగా, మే 3న ఫలితాలు ప్రకటించారు. అందులో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) 36 వార్డులో విజయం సాధించగా, ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు(రెబల్‌), బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కో వార్డులో గెలుపొందారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకుంది. మే 7, 2021న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల బాధ్యతలు చేపట్టారు. మే 6, 2026కు పదవీ బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు పూర్తి అవుతుంది. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పలు మార్లు ప్రయత్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు పట్టువీడకుండా హరీశ్‌ రావు వైపే ఉన్నారు. దీంతో నలుగురు మాత్రమే అఽధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

30న పాలకవర్గానికి సన్మానం

నెల 30వ తేదీన సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత చాలా అవార్డులు అందుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అనేక అవార్డులు సాధించింది. మే మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు డివిజన్ల సంఖ్య పెంచాలని మున్సిపల్‌ శాఖ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీలో సైతం వార్డుల పెంపు? వార్డుల పునర్విభజన ఉంటుందా? అని అధికారులను పలువురు రాజకీయ పార్టీనేతలు, ఆశావహులు అడిగి తెలుసుకుంటున్నారు. వార్డుల పెంపు ఉంటే ఎంత మంది ఓటర్లకు ఒక వార్డును విభజిస్తారని రాజకీయ పార్టీల నేతలు, ప్రస్తుత కౌన్సిలర్లు ఆరా తీస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి.

పాలకవర్గానికి మరో 11రోజులు మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీ ప్రత్యేక అఽధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2010 నుంచి 2016 వరకు ప్రత్యేక పాలనలో బల్దియా కొనసాగింది. పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పుడు ఆయా గ్రామాల ప్రజలు కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరేళ్లు ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2016లో ఎన్నికలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement