జూనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా కె.సౌజన్య నియామకం అయ్యారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ ఎల్‌బీనగర్‌ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న సౌజన్య సిద్దిపేటకు రానున్నారు. అదేవిదంగా వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న బానోతు శ్రీరామ్‌ చేర్యాల కోర్టుతోపాటు సిద్దిపేట జువైనల్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

డిమాండ్‌ ఉన్న

పంటలే సాగు చేయండి

వ్యవసాయ శాస్త్రవేత్త పల్లవి

దుబ్బాక: రైతులు కేవలం వరిపంటపైనే ఆధారపడకుండా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేస్తూ లాభాలు ఆర్జించాలని వ్యవసాయ శాస్రవేత్త పల్లవి అన్నారు. శుక్రవారం హసన్‌మీరాపూర్‌లో మండల వ్యవసాయ అధికారి ప్రయదర్శిని ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానాలపై రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో కలిగే లాభాలను తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నగేష్‌, కార్యదర్శి తేజస్విని, రైతులు తదితరులు ఉన్నారు.

పంప్‌ హౌస్‌

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

నంగునూరు(సిద్దిపేట): మండలంలోని వాగవతలి గ్రామాలకు సాగు నీరందించేందుకు ఘణపూర్‌ వద్ద నిర్మించిన పంప్‌ హౌస్‌ పూర్తి కావడంతో శుక్రవారం ఇరిగేషన్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ చేపట్టారు. రంగనాయకసాగర్‌ కుడి కాలువ ద్వారా ఖాతా, ఘణపూర్‌, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లోని 13 చెరువులను నింపేందుకు ఘణపూర్‌ వద్ద పంప్‌ హౌస్‌ నిర్మాణం కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్‌ అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పంప్‌ హౌస్‌తో నాలుగు గ్రామాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఘణపూర్‌లో 4 చెరువులు, అక్కేనపల్లి 4, గట్లమల్యాలలో 5 చెరువులు నింపడం ద్వారా 4,142 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు.

బాలల హక్కులు

ఉల్లంఘిస్తే చర్యలు

దుబ్బాకటౌన్‌: ప్రభుత్వం బాలల పరిరక్షణ కోసం పలు చట్టాలను ఏర్పాటు చేసిందని, హక్కులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు నరసింహులు అన్నారు. మండల పరిధిలోని తిర్మలాపూర్‌ జెడ్పీ పాఠశాలలో బాలల సంక్షేమంపై మండల విద్యాధికారి కనకరాజుతో కలిసి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారంపై ప్రభుత్వానికి సూచనలు చేయడం కమిటీ ప్రధాన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, వసుంధర, నరేందర్‌, రజని, శ్రీనివాస్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రి సందర్శన

చేర్యాల (సిద్దిపేట): స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌ శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌తో సమావేశమయ్యారు. త్వరలో డయాలసిస్‌ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీం లీడర్‌ నవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement