● మంత్రి పొన్నం రాజీనామా చేయాలి ● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
ప్రభుత్వ హత్యే
గజ్వేల్: ఆర్‌టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శంకర్‌గౌడ్ మృతిచెందారన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆర్‌టీసీ కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇదే క్రమంలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ప్రాణత్యాగానికి ఒడిగట్టారని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు నర్సింగరావు, నవాజ్‌మీరా, బెండ మధు, మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, అర్జున్‌గౌడ్, కృష్ణారెడ్డి, ఆర్‌టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనుగోళ్లల్లో నిర్లక్ష్యాన్ని సహించం టార్గెట్ పూర్తయ్యిందనే సాకుతో పొద్దు తిరుగుడు కొనుగోళ్లను నిలిపివేసి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లను పునఃప్రారంభించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.


