మూడో రోజూ బస్సులు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

మూడో రోజూ బస్సులు బంద్‌

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

సిద్దిపేటకమాన్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

బస్సులన్నీ ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు గంటల తరబడి బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిద్దిపేట బస్టాండ్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలో శుక్రవారం 5 ఆర్టీసీ, 49 అద్దె బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపారు.

ప్రైవేటు వాహనాల దోపిడీ

ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తుండటంతో చేసేదిలేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. దీంతో వారు రెండింతల చార్జీ వసూలు చేశారు. సమ్మెతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన

రంగల్‌ నర్సంపేట డిపో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతికి సంతాపంగా సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి మోడ్రన్‌ బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు నక్క మల్లేశం, బీసీ వెల్ఫేర్‌ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్‌ మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బీఎస్‌ గౌడ్‌, రాజయ్య, కేఎస్‌ నారాయణ, ప్రభాకర్‌రెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొనసాగిన ఆర్టీసీ సమ్మె

నోటికి నల్లరిబ్బన్‌లతో కార్మికుల నిరసన

పలు పార్టీలు, కుల సంఘాల సంఘీభావం

Advertisement
 
Advertisement
Advertisement