విధులు బహిష్కరించి నిరసన ● ఇబ్బందులు పడిన ప్రయాణికులు
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ –ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచే విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఎలాంటి గొడవలు జరగకుండా డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసు పహారా మధ్య తిరిగిన అద్దె బస్సులు
కార్మికులు సమ్మెలో ఉండటంతో అద్దె బస్సులను తిప్పడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలో 63 ఆర్టీసీ, 53 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో 30అద్దె బస్సులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వినియోగించి జేబీఎస్, మెదక్ వంటి ప్రాంతాలకు తిప్పారు. అలాగే దుబ్బాక డిపోలో ఎనిమిది అద్దె బస్సులు కలుపుకొని మొత్తం 37 బస్సులున్నా అన్నీ డిపోకే పరిమితమయ్యాయి. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలో 70 బస్సులకు గాను ఒక ఆర్టీసీ, 16 అద్దె బస్సులు నడిచాయి. హుస్నాబాద్ డిపోలో 22 అద్దె బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పారు. సిద్దిపేట డిపో పరిధిలో వివిధ ప్రాంతాలకు నడిపిన అద్దె బస్సుల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండులు వెలవెలబోయాయి.
ప్రైవేటు నిలువు దోపీడీ
ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహ నదారులు అధిక చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సిద్దిపేట నుంచి జేబీఎస్‌కు ఒక్కొక్కరికి రూ.150 చార్జీ చేయగా.. ప్రైవేటు వాహనదారులు రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించి మరిన్ని బస్సులను నడపనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు.
కాంట్రాక్ట్ పద్ధతిన
కండక్టర్లు, డ్రైవర్లు కావలెను
హుస్నాబాద్: ఆర్టీసీ డిపోలో రోజు వారి కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయుటకు కండక్టర్లు, డ్రైవర్లు కావాలని హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. కండక్టర్ పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవర్‌కు హెవీ లైసెన్స్ 18 నెలల అనుభవం ఉండాలని సూచించారు. ఆసక్తి గల వారు ఒరిజినల్ ధ్రువపత్రాలతో డిపోలో హాజరు కావాలని సూచించారు.


