ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కవులకు అవార్డులు వరించాయి. సిద్దిపేటకు చెందిన ఉండ్రాళ్ళ రాజేశం, భైతి దుర్గయ్యలకు బాలసాహితీ మిత్ర అవార్డుతో పాటు జ్ఞాపిక, రూ.5వేల నగదు అందజేయనున్నట్లు సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య బుధవారం తెలిపారు. రెండు దశాబ్దాలుగా వివిధ బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలలచే రచనలు చేయించి పుస్తక రూపంలో అందించినందుకు గాను జాతీయస్థాయిలో బాలసాహితీమిత్ర అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 4న నగరంలో నిర్వహిస్తున్న బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో అవార్డులు అందించనున్నట్లు చెన్నయ్య చెప్పారు.
కాంగ్రెస్‌తోనే
సొంతింటి కల సాకారం
కొండపాక(గజ్వేల్): పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. కొండపాక మండలం సిర్సనగండ్ల, కుకునూరుపల్లిలో బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం పథకం కింద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువగా లబ్ధిపొందారన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భాగ్య కుటుంబానికి
అండగా ఉంటాం
మిరుదొడ్డి(దుబ్బాక): ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య ఎలియాస్ రూపీ కుటుంబ సభ్యులను ధర్మారంలో బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రజాభ్యుదయం కోసం 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి పోరాడిన భాగ్య ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారానికి
చెంపపెట్టు
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
గజ్వేల్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కరువును శాశ్వతంగా నిర్మూలించేందుకు దోహదపడిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. జస్టిస్ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతోనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలన్నారు.
నర్సాపూర్: మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఇన్‌చార్జి కమిషనర్ తిరుపతి తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వారి కోసం రెండు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రెండు కోఆప్షన్ పదవులు ఉంటాయని, రెండు వర్గాలలో ఒక పోస్టు మహిళకు కేటాయించినట్లు చెప్పారు. కాగా ఈనెల 23 నుంచి 29 వరకు తమ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.


