కొండపోచమ్మలో బోటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మలో బోటింగ్‌

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

అధునాతన స్పీడ్‌ బోట్‌ల ఏర్పాటు

ర్యాటక శాఖ రాష్ట్రంలోని 12 జలశయాల వద్ద బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందులోభాగంగానే కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లో ‘బోటింగ్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతన స్పీడ్‌ బోట్‌లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతీ కొండపోచమ్మసాగర్‌ పరిసరాల్లో సందడిపెరిగి.. మరిన్ని హోటళ్లు, రెస్టారెంట్లు రానున్నాయి.

గజ్వేల్‌: కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ కొత్త శోభను సంతరించుకొని, మరింత ఆహ్లాదాన్ని అందించబోతున్నది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న ఈ రిజర్వాయర్‌లో బోటింగ్‌ ఏర్పాటుచేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం శాఖ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలోని 12 జలశయాల్లో బోటింగ్‌ ఏర్పాటుకు నిర్ణయించగా.. అందులో కొండపోచమ్మసాగర్‌ ఒకటి. మాజీ సీఎం కేసీఆర్‌ చొరవ ఫలితంగా మర్కూక్‌ మండల కేంద్రంలో కొండపోచమ్మసాగర్‌ జలాశయం నిర్మాణం జరిగింది. 2020 మే 29న ఈ జలాశయాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల్లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్‌లోకి మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా జిల్లాలోని రంగనాయక్‌సాగర్‌, మల్లన్నసాగర్‌ ద్వారా కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లామీదుగా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్‌ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి ఉంది. అంతేకాకుండా వరంగల్‌ హైవే, నిజామాబాద్‌వైపు వేళ్లే 44 నంబర్‌ జాతీయ రహదారితో ఈ రోడ్డును అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ రహదారి 96కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూవస్తోంది. ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న పర్యాటకులను మరింత ఆహ్లాదపరచడానికి ప్యారాచూట్‌ విహారం ఏర్పాటు చేశారు.

భద్రతపై తొలగని ఆందోళన

కొండపోచమ్మసాగర్‌కు సెలవు రోజుల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రిజర్వాయర్‌ను ప్రారంభించిన తొలి నాళ్లల్లో ఇక్కడ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ కొనసాగింది. అదేవిధంగా సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ రానురానూ ఇక్కడ భద్రత తగ్గింది. 2025 జనవరి 11న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా చర్యలపై సైతం అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌

ఏర్పాటుకు రంగం సిద్ధం

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు

Advertisement
 
Advertisement
Advertisement