జహీరాబాద్: వ్యవసాయంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గాను యాంత్రీకరణ అన్నదాతను ఆదుకుంటోంది. పొలం దుక్కి దున్నడం వద్ద నుంచి పంట చేతికి అందివచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకచకా సాగడమే కాకుండా సకాలంలో పనులను పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతోంది. కూలీల కొరత సైతం తీరుతోంది. పంటల్లో వచ్చే చీడ పీడల నివారణ కోసం పురుగు మందులను పిచికారి చేసేందుకు గాను డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాటి వినియోగం నానాటికీ పెరుగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో వానాకాలంలో 7.60లక్షలు, యాసంగిలో 2.80లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, అల్లం, అరటి, కంది, మినుము, పెసర, శనగ, జొన్న, ఆలుగడ్డ, అల్లం, బొప్పాయి, అరటి, పసుపు, సోయాబీన్‌పంటల సాగుతో పాటు కూరగాయ పంటలు సాగవుతున్నాయి.
జిల్లాకు పది మేర కేటాయింపు
మొదటి విడతలో జిల్లాకు 10 డ్రోన్లు కేటాయించింది. మార్చిలో 10 డ్రోన్లను పంపిణీ చేయాలని లక్ష్యం నిర్ణయించగా 9 డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా ముందుకు వచ్చే రైతులకు, ఆయా సంఘాలకు డ్రోన్లను ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ రాగానే అందుకు అనుగుణంగా పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఒక్కో డ్రోన్ యూనిట్ వ్యయం ఆయా కంపెనీలను బట్టి రూ.9.50 లక్షల నుంచి రూ.11.50లక్షల వరకు ఉన్నాయి. ప్రతి యూనిట్‌కు 40 శాతం మేర సుమారు రూ.4లక్షల వరకు రాయితీ ఇస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఒక్కో యూనిట్‌కు రూ.4లక్షల వరకు సబ్సిడీ
సహకార, మహిళాసంఘాలకు ప్రాధాన్యం
రైతులకు తీరనున్న పిచికారీ అవస్థలు
జిల్లాలో 10డ్రోన్లకు 9 పంపిణీ


