సిద్దిపేటజోన్: మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ) విద్యుత్ భారం నుంచి గట్టెక్కేందుకు సిద్దిపేట బల్దియా వినూత్న ప్రక్రియ చేపట్టింది. యూజీడి పథకానికి అనుసంధానంగా ఎస్టీపీని అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జెల్ హి అమృత్ పథకం కింద ఉత్తమ నిర్వహణకు గాను రూ.2.75కోట్లు ఇన్సెంటివ్ కింద మంజూరు చేసింది. ఆ నిధులతో ఎస్టీపీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. శుద్ధీకరణ ప్రక్రియ కోసం విద్యుత్ చార్జీల భారం పడకుండా సొంతంగా సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, కమిషనర్ ఆశ్రిత్ కుమార్ లాంఛనంగా సోలార్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట మున్సిపాలిటికీ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిందన్నారు. వచ్చిన నిధులతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తంగా 286 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ ప్రేరణ, ఇంజనీర్ పథ్వీరాజ్, కౌన్సిలర్ అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన
మున్సిపల్ చైర్‌పర్సన్


