ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. సోమవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలను ప్రకటించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన లుక్క అక్షయ్ గుణ 873వ ర్యాంకు, ఊడెం కౌశిక్ వర్ధన్‌రెడ్డి 1594వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ముంబాయిలో ప్రవేశం పొందడమే లక్ష్యంగా చదువుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో (విద్యారణ్య అవాస విద్యాలయం)లో చేరుటకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ మంగళవారం తెలిపారు. 3వ తరగతిలో 5 సీట్లు, 5వ తరగతిలో 3 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు మే 7న సాయంత్రం 5గంటల లోపు తమ దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మే 15న ఉదయం 11గంటలకు కలెక్టర్ కాంప్లెక్స్‌లో డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
విద్యాధరి క్షేత్రంలో
శంకర జయంతి
వర్గల్(గజ్వేల్): విద్యాధరి క్షేత్రంలో మంగళవారం శంకర జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో వేదపండితులు ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షకులు ఆదిశంకరుల బోధనలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావన వైపు నడిపించాయన్నారు. ఈ మహోత్సవం అనంతరం సిద్ధాంతిని ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది.
ఆకస్మిక తనిఖీ
మిరుదొడ్డి(దుబ్బాక): చెప్యాల క్రాస్ రోడ్డులోని గురుకుల బాలుర ఉన్నత పాఠశాల/కళాశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ గణేశ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్ని గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, ఉపన్యాసం, డ్యాన్స్, డ్రామా, కవితలు, క్విజ్ పోటీలను నిర్వహించారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. కార్యక్రమాలలో నోడల్ అధికారులు, స్థానిక వార్డెన్లు పాల్గొన్నారు.


