దుబ్బాకలో 10 మంది దరఖాస్తు
పైరవీలు ముమ్మరం చేసిన ఆశావహులు
దుబ్బాక: మున్సిపల్‌లో కో ఆప్షన్ పదవుల ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. పదవుల కోసం మొత్తం పది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు పదవులకు పది మంది పోటీ పడుతుండటంతో ఎంపిక ఆసక్తికరంగా మారింది. మున్సిపల్‌లో మొత్తం 20 కౌన్సిలర్లకు గాను బీఆర్‌ఎస్‌కు 14 మంది కౌన్సిలర్ల బలంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పీఠాలను దక్కించుకున్నారు. కాంగ్రెస్‌కు 4, బీజేపీకి ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. దీంతో నాలుగు కో ఆప్షన్ పదవులను బీఆర్‌ఎస్‌కు అవకాశం ఉండటంతో చాలా మంది నేతలు ఎలాగైన దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రసన్నం కోసం..
మైనార్టీ కోటాలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్, వసీం, మైనారిటీ మహిళా కోటాలో కై సర్, నసీమా, ప్రజాప్రతినిధుల కోటాలో జనరల్‌లో మాజీ కౌన్సిలర్లు ఆస యాదగిరి, కూరపాటి బంగారయ్య, మాజీ సర్పంచ్ వేముల మల్లేశంగౌడ్, ఆస రవి, మహిళా కోటాలో మాజీ కౌన్సిలర్లు పల్లె మీనా, గోనెపల్లి దేవలక్ష్మీ, దేవుని లలిత దరఖాస్తు చేసుకున్నారు. పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రసన్నం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కో ఆప్షన్ ఎంపిక ఎమ్మెల్యేకు సైతం తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కో ఆప్షన్ పదవులు ఎవరి దక్కుతాయోనన్నది మూడు రోజులు వేచి చూడాల్సిందే.
హుస్నాబాద్‌లో 11 మంది దరఖాస్తు
హుస్నాబాద్: మున్సిపల్‌లోని కో ఆప్షన్ పదవులకు 11 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మొత్తం నాలుగు కో ఆప్షన్‌లకు గాను మాజీ ప్రజాప్రనిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు ( మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీలకు రెండు స్ధానాలు (మహిళ, జనరల్)కు కేటాయించారు. మొహమ్మద్ రెహానా, కాత సల్మాన్ రెడ్డి, ఫహిమా మున్సీసా బేగం, పచ్చిమట్ల సత్తయ్య గౌడ్, అయిలేని అనిత, వల్లపు రాజయ్య, మొహమ్మద్ హాసన్, కాత గ్లోరీనా , చిట్యాల మలాకి, పున్న లావణ్య, భూక్య సరోజనలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22, 23, 24 దరఖాస్తుల పరిశీలన ఉంటుందని కమిషనర్ తెలిపారు.


