సీడీపీఓకు వినతి పత్రం ఇస్తున్న గ్రామస్తులు
దుబ్బాకరూరల్: మండలంలోని రాజక్కపేట అంగన్‌వాడీ కేంద్రంలో ఉడక బెట్టిన గుడ్లు కుళ్లిపోయాయి. మంగళవారం పిల్లలకు ఉడక బెట్టిన గుడ్లు వడ్డించారు. గుడ్లను చిన్నారులకు ఇవ్వగా వారితో వచ్చిన తల్లులు వాటిని విప్పడంతో పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో వారు ఆందోళన చెందారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో అంగన్‌వాడీ సిబ్బందిని నిలదీశారు. కుళ్లిపోయిన గుడ్లను ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. కలుషిత ఆహారం తీసుకోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కోరారు. అంగన్‌వాడీ సెంటర్‌కు సీడీపీఓ ఎల్లయ్య చేరుకుని అక్కడ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలకు సంబంధించిన గుడ్లను వడ్డించడం వల్లే కుళ్లి పోయాయని తెలిపారు. గుడ్లను ఎప్పటికప్పుడే వడ్డించాలని, కాలం చెల్లిన వాటిని పెట్టకూడదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి టీచర్‌కు, ఆయాకు మెమోలు జారీ చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులు సీడీపీఓకు వినతి పత్రం అందజేశారు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు


