బంధం.. బలహీనం | - | Sakshi
Sakshi News home page

బంధం.. బలహీనం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

చెరువు పరిరక్షణ ఏదీ?

ఆయకట్టు సాగుకు స్వస్తి

మరమ్మతులకు ఇదే సరైన సమయమంటున్న రైతులు

వర్గల్‌(గజ్వేల్‌): మండల పరిధిలోని చౌదరిపల్లి ‘బంధం’ చెరువు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కొండపోచమ్మ సాగర్‌ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్‌ చానల్‌ ఇది. కోతకు గురైన కట్టతో ‘బంధం’ చెరువు పరిస్థితి ఎప్పుడేమవుతుందో అన్నట్లు మారింది. మరోవైపు కట్ట నుంచి జాలువారుతున్న నీటితో పొలాలు దిగబడుతుండటంతో దాదాపు 60 ఎకరాల ఆయకట్టు సాగుకు రైతులు స్వస్తి పలికారు. 2021లో చెరువు దుస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ, అగ్రిమెంట్‌ జరిగిపోగా, నాటి నుంచి ‘నిండా జలం’తో చెరువు మరమ్మతులు సాధ్యపడలేదు. ప్రస్తుతం నీరు అడుగంటడంతో సత్వరమే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

భారీ జలాశయాల్లో ఒకటిగా..

పూర్వకాలంలో సాగుకు దన్నుగా వర్గల్‌ మండలంలో నిర్మితమైన 13 భారీ జలాశయాలలో ‘బంధం’ చెరువు ఒకటి. 12 శతకోటి ఘనపుటడుగుల(మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌) నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ చెరువు కింద 118 ఎకరాల ఆయకట్టు నిర్దేశితమైంది. ఎనిమిదేళ్ల క్రితం భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. కట్టకు గండి భయంతో మత్తడి వద్ద మూడు వరుసల రాళ్లు తొలగించారే తప్ప అధికారులు కట్ట పటిష్ఠత చర్యలు చేపట్టలేదు. ఆ తరువాత కట్టకు పగుళ్లు, పిచ్చిమొక్కలతో చెరువు పరిస్థితి మరింత దిగజారింది.

హల్దీకి ఫీడర్‌ చానల్‌గా..

కొండపోచమ్మ సాగర్‌ జలాలను హల్దీలోకి తరలించే ఫీడర్‌ చానల్‌గా ‘బంధం’ చెరువు కీలకమైంది. 2021 ఏప్రిల్‌ నుంచి గోదావరి జలాలు హల్దీలోకి గోదావరి జలాలను తరలిస్తుండడంతో వానాకాలం, ఎండాకాలం తేడాలేకుండా నాటి నుంచి బంధం చెరువు నిండుకుండను తలపిస్తోంది. దీంతో అలల తాకిడికి చెరువు కట్ట కోతకు గురవుతున్నది. ‘మైసమ్మ గుడి’ ప్రాంతంలో కట్ట కుంగిపోయి, ఇరుకుగా మారి పటిష్టత కోల్పోయింది.

ఇరుపుగండ్లతో సాగుకు స్వస్తి

కట్ట మధ్యలో ఇరుపు గండ్లు(పగుళ్లు) ఏర్పడి ఆయకట్టు పొలాల్లోకి నీరు జాలువారుతుందని రైతులు వాపోయారు. నీటిజాలుతో పొలం దిగబడి సాగుచేయలేని పరిస్థితిలో దాదాపు 60 ఎకరాల ఆయకట్టు సాగుకు స్వస్తిపలికామని ఆవేదన వ్యక్తం చేశారు. కట్ట పటిష్టం చేస్తే పొలాలు తిరిగి సాగుచేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement