కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు: కలెక్టర్
● రహదారిపై అడ్డంగా దుంగలు పెట్టి బైఠాయింపు
● మిరుదొడ్డి ఏఎంసీ గోదాం వద్ద ఘటన
మిరుదొడ్డి(దుబ్బాక): కొనుగోలు కేంద్రానికి సన్‌ఫ్లవర్, మక్కలు తీసుకువచ్చి పక్షం రోజులు గుడుస్తున్నా కాంటా వేయడం లేదంటూ సోమవారం మిరుదొడ్డి ఏఎంసీ గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా చెట్ల దుంగలు పెట్టి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోనె సంచులు ఇవ్వడంలో కూడా అధికారులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అనుకూలంగా ఉన్న వారికి గొనెసంచులు అందిస్తున్నారని ఆరోపించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పక్షం రోజులుగా కాంటా పెట్టకుండా, గోనె సంచులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సమాధానం చెప్పి తీరాలని రైతులు పట్టుబట్టారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంటా పెట్టేలా చొరవ తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్ల దుంగలను పోలీసులే స్వయంగా తొలగించారు. సుమారు గంట పాటు జరిగిన రైతుల ఆందోళనతో మిరుదొడ్డి –గజ్వేల్ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
కోహెడరూరల్(హుస్నాబాద్): వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్‌లో ఐకేపీ సెంటర్‌ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ముప్పు ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులకు తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి లోడింగ్ చేయాలన్నారు. కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని లారీల కొరత వల్ల రవాణా ఆలస్యమవుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందిస్తూ వెంటనే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి సరిపడా లారీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.


