మంత్రి చెంతకు బాధితుడు | - | Sakshi
Sakshi News home page

మంత్రి చెంతకు బాధితుడు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

కుటుంబసభ్యులతో మంత్రిని కలిసి..

న్యాయం చేయాలని వేడుకోలు

రింగ్‌ రోడ్డు వ్యవహారంలో మరో ట్విస్ట్‌

గజ్వేల్‌: రింగ్‌ రోడ్డు అంశంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈనెల 11న రింగ్‌ రోడ్డు పనులు ఆగిపోయిన రైతు రామచంద్రం పొలం వద్దకు ఎంపీ రఽఘునందన్‌రావు వెళ్లడం, సదరు రైతుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా బాధిత రైతు మంత్రి దామోదరను కలిసి న్యాయం చేయాలని కోరడం చర్చనీయాంశంగా మారుతోంది.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ రింగ్‌ రోడ్డు పనులు రూ.233 కోట్ల వ్యయంతో చేపట్టగా, 23కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. సంగాపూర్‌ రోడ్డు వైపున రైతు రామచంద్రం పొలం వద్ద కేవలం 150మీటర్ల పనుల పెండింగ్‌ వల్ల పదేళ్లుగా అనుసంధానానికి నోచుకోని విషయం విదితమే. మరోవైపు ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతు రామచంద్రానికి భూమికి, భూమి ఇవ్వాలని, లేదా మెరుగైన పరిహారం ఇవ్వాలని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2023లో సదరు రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ రైతుకు తగువిధంగా న్యాయం చేయడానికి ప్రజాప్రతినిధుల నుంచిగానీ, అధికారుల నుంచిగానీ గట్టి ప్రయత్నం జరగలేదు. దీంతో అప్పటినుంచి పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలో ఈనెల 11న ఎంపీ.. రింగ్‌ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్న రామచంద్రం పొలం వద్ద స్వయంగా పరిశీలన జరిపారు. రైతుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, లేదంటే చట్టప్రకారం ముందుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.

ఎంపీ ప్రకటన తర్వాత అధికారుల నుంచి తరుచూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని ఆందోళనకు గురైన బాధిత రామచంద్రం, తన భార్య, కుమారునితో సోమవారం మంత్రి దామోదరను కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఈ పరిణామం పట్టణంలో చర్చనీయాంశంగా మారుతోంది. మంత్రిని కలిసిన తర్వాతనైనా బాధితునికి న్యాయం జరిగి.. రింగ్‌ పనులు పూర్తికావడానికి మార్గం సుగమమవుతుందా? లేదా అని అంతా చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement