● ట్రయల్ రన్ సక్సెస్
● ఐదు వార్డుల్లో తొలి ఫలితం
సిద్దిపేటజోన్: గోదావరి నీటిని సిద్దిపేట బల్దియా ప్రజలకు అందించాలనే లక్ష్యంలో తొలి అడుగు పడింది. ఎమ్మెల్యే హరీశ్‌రావు ముందు చూపుతో శాశ్వత దాహార్తిని తీర్చేందుకు రూపకల్పన చేసిన వాటర్ రింగ్ మెయిన్‌తో మొదటి ఫలితం అందనుంది. రూ. 50లక్షలతో సిద్దిపేట పట్టణం చుట్టూ భారీ వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే రూ.10లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ వద్ద సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల కొబ్బరికాయ కొట్టి గేట్ వాల్ ఆన్ చేసి ట్రయల్ రన్ చేపట్టారు. దీంతో 5, 6, 7, 22, 26 వార్డుల్లో గోదారి నీరు ఇంటింటికీ సరఫరా కానుంది. ఇదే తరహాలో పట్టణానికి నలుదిక్కులా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగధాంపల్లి, ఇందిరమ్మ కాలనీ, గాడిచర్లపల్లి ప్రాంతాల్లో కూడా రూ.10లక్షల చొప్పున భారీ వాటర్ ట్యాంక్‌లను నిర్మిస్తున్నారు. మిషన్ భగీరథ తరహాలోనే సిద్దిపేట పట్టణ ప్రజలకు మానేరు నీటితో పాటు గోదారి జలాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


