భగీరథ నీరు స్వచ్ఛమైనవి
మున్సిపాలిటీలోనూ మినరలే...
● స్వచ్ఛమైన నీరు అని చెప్పే వారే తాగకపోవడమా?
● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్
● అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు
భగీరథ నీరు.. అధికారులు తాగరు
‘మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి.. పలుమార్లు శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం.. భగరీథ నీటిని తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటా’రని అధికారులు తరచూ చెప్పే మాటలను వారే ఆచరించకపోవడం విచిత్రం. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతుండటం గమనార్హం. చెప్పే వారే పాటించకపోతే ఎలా అని
సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామ పంచాయతీలలో 1,515 ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నుంచి 2,06,308 గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఆ నీటిని కార్యాలయ సిబ్బంది తాగకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని తెప్పిస్తున్నారు. ఇలా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను అధికారులే వినియోగిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా ఆ నీరు తాగడం లేదంటే.. భగీరథ నీటిపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల్లో మినరల్ వాటర్‌కు స్వస్తి పలికి మిషన్ భగీరథ వాటర్‌ను తాగి ప్రజల్లో మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది.
సమీకృత కలెక్టరేట్‌లో సైతం..
జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో దాదాపు 44శాఖలకు సంబంధించిన జిల్లా ప్రధాన కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సమీకృత కలెక్టరేట్‌కు నిత్యం ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నుంచి ఆటో ట్రాలీ వస్తుంది. పెద్ద ట్యాంక్‌లో నీటిని తీసుకువచ్చి క్యాన్లలో నింపి కార్యాలయాల్లోకి పంపిస్తున్నారు. ప్రైవేట్ మినరల్ వాటర్‌నే అధికారులు, సిబ్బంది తాగుతున్నారు. అలాగే కలెక్టరేట్‌లోని అధికారిక నివాసాలకు సైతం భగీరథ వాటర్ కనెక్షన్లు ఇచ్చారు. ఇటీవల మిషన్ భగీరథ వాటర్‌నే తాగుతున్నానని కలెక్టర్ హైమావతి ప్రకటించారు. సాక్షాత్తు కలెక్టరే భగీరథ నీరు తాగుతున్నా.. జిల్లా అధికారులు మాత్రం ప్రైవేటు మినరల్ వాటర్ వైపు మొగ్గుచూపడం గమనార్హం.
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కూలింగ్ ఫ్రిడ్జ్ పక్కన మినరల్ వాటర్ క్యాన్లు
మిషన్ భగీరథ నీటిని పలు మార్లు ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా అందజేస్తున్నాం. మా కార్యాలయంలో నల్లా కనెక్షన్ కొంత ఇబ్బంది ఉండటంతో మినరల్ వాటర్ క్యాన్ ద్వారా తెప్పించుకుంటున్నాం. నల్లా కనెక్షన్ ద్వారా వచ్చే నీటినే తాగుతాం.
– నర్సింహులు, ఈఈ, మిషన్ భగీరథ
ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను కట్టడి చేయాల్సిన మున్సిపల్ అధికారులే కట్టుతప్పుతున్నారు. పట్టణ ప్రజలందరూ మిషన్ భగీరథ నీరు తాగడానికి సరఫరా చేస్తున్నారు. కానీ సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం అధికారులు, సిబ్బంది మాత్రం ప్రైవేట్ ప్లాంటు నీళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
సిద్దిపేట పట్టణంలోని మిషన్ భగీరథ ఈఈ కార్యాలయంలో భగీరథకు చెందిన మున్సిపల్ నల్లా కనెక్షన్ ఉన్నా బయట నుంచి మినరల్ వాటర్‌ను క్యాన్‌లలో తెప్పించుకుని తాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్‌ను సరఫరా చేస్తున్న కార్యాలయ సిబ్బందే తాగడం లేదు. ప్రతి రోజు ప్రైవేటు ప్లాంటు నుంచి వచ్చే మినరల్ నీటినే ఇక్కడి వారంతా వినియోగిస్తున్నారు.


