వైద్య సేవలు నిరంతరం అందాలి
సమయపాలన పాటించకపోతేచర్యలు: కలెక్టర్ హైమావతి
మద్దూరు(హుస్నాబాద్): గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటలూ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. మద్దూరు మండల కేంద్రంతో పాటుగా లద్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా అనుమతి తీసుకున్నారా? అని డీఎంహెచ్‌ఓకు ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలాగే మెడికల్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు ఉన్నతాధికారులు అనుమతించాకే సెలవు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలన్నారు. ఇష్టానుసారంగా సమయానికి వస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ఆవిష్కరించనున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ప్రజావాణికి ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.
అర్జీలు పునరావృతం కావొద్దు
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 116 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


