నిబంధనలు పాటిద్దాం..
ద్విచక్ర వాహనదారులకుహెల్మెట్ తప్పనిసరి
జిల్లా ప్రధాన న్యాయమూర్తిసాయిరమాదేవి
సురక్షితంగా ప్రయాణిద్దాం
సిద్దిపేటకమాన్: రోడ్డు నిబంధనలు పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. రహదారి భద్రత కార్యచరణలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టు వద్ద సోమవారం నిర్వహించిన ర్యాలీని న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. విక్టరీ చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను న్యాయమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, రవాణశాఖ ఎంవీఐ శంకర్‌నారాయణ, మహిళా పీఎస్ ఎస్‌ఐ నాగరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.


