
పరిషత్ సంగ్రామం
15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీలకు నామినేషన్ల స్వీకరణ సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో టెన్షన్
పల్లెల్లో ఓట్ల పండుగ షురూ అయ్యింది. స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలో పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరగనున్నాయి. ఈ మేరకు గురువారం తొలి విడతలో జరిగే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
–సాక్షి, సిద్దిపేట
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలలో జరగనున్నాయి. మొదటి విడతలో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీలు, రెండో విడతలో 11 జెడ్పీటీసీలు, 105 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించనున్నారు. మొదటి విడతకు సంబంధించి ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా, 13వతేదీ వరకు అప్పీల్‌కు అవకాశం, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న నామినేషన్ల ఉపసంహరణ, మధ్యాహ్నం 3గంటలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలను నియమించి నామినేషన్ల స్వీకరణ, నిబంధనల గురించి శిక్షణ ఇచ్చారు.
నేడే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్
కొనసాగుతున్న టెన్షన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహుల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టులో కేసు గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఏమి ప్రకటిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
ముహూర్తాలు చూస్తున్న అభ్యర్థులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తాలను తెలుసుకుంటున్నారు. ఈ మూడు రోజుల్లో కలిసి వచ్చే రోజును తెలుసుకుని నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగం చేశాయి. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేపనిలో నిమగ్నమయ్యారు.