
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
ములుగు ఉద్యానవర్సిటీవైస్ చాన్సలర్ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): రైతులు అవకాడో, కూరగాయల లాంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ రాజిరెడ్డి సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ధన్–ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా విశ్వవిద్యాలయంలో రైతులు, అధికారులు, విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన పంటల ఉత్పత్తి ఇప్పటికే 350 మిలియన్ టన్నులకు చేరిందని ఇది సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువని రైతులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాల దిశలో ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం రైతులు ఉద్యాన శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కరివేపాకు, మునగ వంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ అధికారులు సురేష్‌కుమార్, సిందుజ, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.