
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్
గజ్వేల్‌రూరల్: బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్న పార్టీలకు గుణపాఠం తప్పదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42శాతం రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆరు నెలలవుతోందని, అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందినప్పటికీ గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంచడం విచారకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని పార్టీలకు పుట్టగతులుండవని, కోర్టులను అడ్డం పెట్టుకొని 42శాతం రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్న పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లబిల్లులు చెల్లించండి
సీపీఎం నేత శెట్టిపల్లి సత్తిరెడ్డి
కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆన్‌లైన్ లోపాలను సవరించి బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి తాడూరి రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 11 గ్రామాలలో 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు పనులు ప్రారంభించారని తెలిపారు. అందులో చాలా వరకు బేస్మెంట్ వరకు పనుల పూర్తి అయినా బిల్లులు చెల్లించడం లేదన్నారు. లబ్ధిదారులు అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసిన తర్వాతే చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. బిల్లులు సకాలంలో రాక లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. అధికారులు స్పందించి ఆన్‌లైన్ లోపాలను సవరించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి మల్లేశం, శారద, నీల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల అభివృద్ధికి కృషి
హుస్నాబాద్‌రూరల్: గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్నారు. శనివారం పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మరణించిన విషయంపై ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు కార్పొరేటు విద్యను అందించడానికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుందన్నారు. నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మించడానికి భూ సేకరణ చేసినట్లు చెప్పారు. గురుకులంలో విద్యార్థి మరణం అందరికీ బాధకలిగించదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు రోజుల్లో హుస్నాబాద్‌కు వచ్చి విద్యార్థి కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాజ్‌కుమార్, రాజు, మహేందర్‌లు ఉన్నారు.
95 మద్యం దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 95దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 93మద్యం దుకాణాల నిర్వహణకు శనివారం 43 దరఖాస్తులు వచ్చినట్లు, మొత్తం 95దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. రెండోవ శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్