
పత్తికి మద్దతు ఏదీ?
క్వింటాలుకు రూ.5,500 మాత్రమే
ప్రభుత్వ మద్దతు ధరకు రూ.2610 తక్కువ
సీసీఐ కేంద్రాల్లేక రైతులకు తీవ్ర నష్టం
అతివృష్టి కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై పీకల్లోతూ కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కడం లేదు. అవసరాలకు పత్తిని అమ్ముకుందామని వస్తే.. వ్యాపారులు తేమ పేరుతో క్వింటాలుకు రూ.5500మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు ఇది రూ.2610 తక్కువ. సీసీఐ కేంద్రాలు తెరవకపోవడం వల్ల
ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్
జిల్లాలో పత్తి ఉత్పత్తులు.. మార్కెట్ బాట పట్టడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురై ఇబ్బందుల్లో రైతులకు మద్దతు ధర దక్కకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది పత్తికి మద్దతు ధర రూ.7,521 ఉండగా, ఈసారి పింజ పెద్దగా ఉండే పత్తికి గరిష్టంగా రూ.8,110 మద్దతు ధరను ప్రకటించారు. జిల్లాలో 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా, 12లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నది. కానీ కొందరు తమ అవసరాల కోసం కొదిపాటి పత్తి ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకోవడానికి వస్తున్నారు. కానీ పత్తి క్వింటాలుకు రూ.5,500కు మించి ధర పలకడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఇతర కారణాలను సాకుగా చూపి అంతకుమించిన ధర చెల్లించడం లేదు. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్లే ఈ దుస్థితి.
సీసీఐ నిబంధనలతో..
సీసీఐ కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోగా, ఒకవేళ ఏర్పాటుచేసినా కూడా సవాలక్ష నిబంధనలు పెడుతోంది. సిద్దిపేట, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో ఈ కేంద్రాలకు ఇతర జిల్లాలకు చెందిన రైతులు సైతం వచ్చి పత్తిని అమ్ముకునే వారు. కానీ ఈసారి ఉమ్మడి జిల్లాలోని రైతులు మాత్రమే ఆ జిల్లా పరిధిలోని కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవడానికి అర్హులని సీసీఐ నిబంధనలు విధించింది. ఉదాహరణకు మెదక్ జిల్లాలో 34751 ఎకరాల్లో సాగులోకి రాగా 3.48 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ జిల్లాలో ఒక్క సీసీఐ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ జిల్లాకు సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని సీసీఐ కేంద్రంలో మెదక్ రైతు పత్తిని విక్రయించుకునే వీలు లేదని చెబుతున్నారు. ఈ నిబంధన అమలు చేస్తే...లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
త్వరలోనే సీసీఐ కేంద్రాలు తెరుస్తాం
సీసీఐ కేంద్రాలు త్వరలోనే తెరుస్తాం. జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సీసీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం.
– నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి
రూ.5,500 ధరకే అమ్ముకున్నా..
ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశా. వానలతో పంట దెబ్బతిన్నది. రెండ్రోజుల కిందట రెండు క్వింటాళ్ల పత్తి ఏరి గజ్వేల్‌లోని జిన్నింగ్ మిల్లులు అమ్ముకున్నా. రూ.5500మాత్రమే ధర చెల్లించారు. – బీడ చెన్ను, రైతు తిగుల్

పత్తికి మద్దతు ఏదీ?

పత్తికి మద్దతు ఏదీ?