
ధాన్యం నిల్వకు చోటేది?
ఇప్పటికే ప్రారంభమైన వానాకాలం ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రస్తుత సీజన్‌లో 5.08లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం
మిల్లుల్లో మూలుగుతున్న గత సీజన్ల నిల్వలు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) చేసేందుకు మిల్లుల్లో స్టోరేజీ కొరత వేధిస్తోంది. పెద్ద ఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎక్కడ? అన్నది పెద్ద సమస్యగా మారింది. సకాలంలో రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గత యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుత కొనుగోళ్లపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారులలో ఆందోళన మొదలైంది.
439 కోనుగోలు కేంద్రాల ఏర్పాటు
ప్రస్తుత సీజన్‌లో 5.08లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 130 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 132 రైస్ మిల్లులుండగా అందులో ఇప్పటి వరకు బ్యాంక్ గ్యారంటీలను మిల్లర్లు ప్రభుత్వానికి అందించలేదు. గత సీజన్ పూర్తి చేసిన మిల్లర్లవే కొనసాగనున్నాయి.
పై ఫొటోలో కనిపిస్తున్న ధాన్యం బస్తాలు సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ సమీపంలోని ఓ రైస్ మిల్లులోనివి. గత సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులో స్థలం లేకపోవడంతో ఇలా ఆరుబయట పెట్టి టార్పాలిన్లు కప్పారు. ఇదే సమయంలో కొత్త ధాన్యం వస్తే నిల్వ ఎలా చేస్తారో తెలియని పరిస్థితి. ఇలా ఒక్క మిల్లు కాదు జిల్లాలో చాలా రైస్ మిల్లుల్లో ఇదే దుస్థితి. ఆరు బయటనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి.
రైతులకు ఇబ్బందులు రానివ్వం
వచ్చే నెల 12వ తేదీ వరకు ధాన్యంను సీఎంఆర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సీఎంఆర్ చేస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ కానుంది. దీంతో ఆ స్థలాల్లో కొత్త ధాన్యం నిల్వ చేయవచ్చు. అలా కాని పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– ప్రవీణ్, డీఎం,
సివిల్ సప్లయ్ కార్పొరేషన్

ధాన్యం నిల్వకు చోటేది?