
పిల్లలకు పచ్చిపులుసా?
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పచ్చిపులుసుతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండటంపై కలెక్టర్ హైమావతి భోజన నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని పందిల్ల స్టేజి దగ్గర ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పచ్చి పులుసు, టమాటా పప్పు ఉండటంతో మండిపడ్డారు. పిల్లలకు నీళ్ల చారు ఇస్తే ఆరోగ్యం ఏంకావాలని ప్రశ్నించారు. కొత్త మెనూను ఎందుకు అమలు చేయడం లేదని హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికే మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, సాకులు చెప్పి తప్పించుకోవద్దని హెచ్చరించారు. పాఠశాల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం కలెక్టర్ తనిఖీ చేసి పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని రుచి చూశారు. బాలింతలకు అందించే బాలమృతాన్ని పరిశీలించారు. పిల్లలకు రోజూ స్నాక్స్ అందించాలని అయాకు సూచించారు.
వంద శాతం గ్రౌండింగ్ కావాలి
హుస్నాబాద్: ఇందిరమ్మ ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతక ముందు పట్టణంలోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి, సిద్దిపేట నేషనల్‌హైవే పనులు వేగం పెంచాలన్నారు. అంతకపేట నుంచి కొత్తకొండ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడి కేంద్రాల భవనాల కోసం స్ధల సేకరణ చేయాలన్నారు.
ఇది పౌష్టికాహారమా?
విద్యార్థుల ఆరోగ్యం పట్టదా..
‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకులపై
కలెక్టర్ హైమావతి ఫైర్
పందిల్ల గ్రామంలో ఆకస్మిక తనిఖీ