
పాలన చేరువై.. ప్రగతి కరువై
జిల్లా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు
సిద్దిపేట జిల్లాగా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ప్రగతిపై కోటి ఆశలతో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి విడిపోయి 23 మండలాలతో 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లా అవతరించింది. నాటి ఎన్నికల నినాదాలైన జిల్లా అవతరణ.. గోదావరి నీళ్లు.. రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చాయి. కలెక్టర్ గంట సమయంలో ఏ గ్రామానికై నా వెళ్లొచ్చు. స్వయంగా ప్రజలే జిల్లా కేంద్రానికి రావొచ్చు. చేరువలోనే పాలన ఉన్నా.. కానరాని ప్రగతే కలవరపెడుతోంది. పల్లెలు, పలు పట్ణణాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఇప్పుడైనా వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని మంత్రులను, పాలకులను ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ మండలాలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన చేర్యాల, మద్దూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. తరువాత ధూళ్మిట్టను మండలంగా ప్రకటించారు. జిల్లాలో మొదట 298 గ్రామ పంచాయతీలు ఉంటే వాటిని 508కి పెంచారు. గతంలో ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలుండేవి. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. తర్వాత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అక్కన్నపేట, కుకునూరుపల్లి, అక్బర్‌పేట–భూంపల్లి మండలాలను ఏర్పాటు చేసుకుంటూవచ్చారు.
అభివృద్ధి అంతంతే
జిల్లా ఏర్పాటైన తొలి ఏడేళ్ల వరకు అభివృద్ధి పరుగులు పెట్టినా.. ఆ తరువాత కుంటుపడింది. అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయి. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కోమటి చెరువు సుందరీకరణ, శిల్పారామం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రూ.100 కోట్లతో రంగనాయసాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి పనులు పిల్లర్లకే పరిమితం అయ్యాయి. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల వెనక్కి వెళ్లింది. జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ జంక్షన్‌లో మార్కెట్ పనులు ఆగిపోయాయి. సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు దాదాపు 90శాతం పూర్తి కాగా మరో 10శాతం పనులకు నిధులు లేని కారణంగా వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో వినియోగంలో లేదు. ఇప్పటికై నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేసి ప్రగతిని పరుగులు పెట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కోటి ఆశలతో పదో వసంతంలోకి
జిల్లాలో 26 మండలాలు..
508 పంచాయతీలు
అభివృద్ధిపై మంత్రులు దృష్టిసారించాలని
కోరుతున్న ప్రజలు