
అజ్ఞాతం నుంచి జనంలోకి..
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. గ్రామానికి చెందిన కొంకటి లచ్చవ్వ ఓజయ్యల చిన్న కుమారుడు వెంకటయ్య మండల కేంద్రంలో పదో తరగతి వరకు చదువుకున్నారు.1990లో 19 ఏళ్ల వయస్సులో చేర్యాల పీపుల్స్‌వార్ దళ కమాండర్ బాలన్న ప్రోత్సాహంతో పీపుల్స్‌వార్‌లో చేరారు. వెంకటయ్య చేర్యాల దళంలో రమేశ్ అన్నగా, దళసభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహదేవ్‌పూర్ జిల్లా కమిటీ సభ్యుడిగా ఛతీస్‌గఢ్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. అక్కడే మవోయిస్టుగా పని చేస్తున్న మంజులను వివాహం చేసుకున్నారు. ఆమె గత సంవత్సరం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వారి కుటుంబ సభ్యులతో నగరంలో ఉంటున్నారు. వెంకటయ్యపై ప్రభుత్వం అప్పట్లో రూ.5లక్షల రివార్డు ప్రకటించింది. వెంకటయ్య తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందిన సమయంలోనూ గ్రామానికి రాలేదు. ప్రస్తుతానికి అతని కుటుంబ సభ్యులు ఎవరూ గ్రామంలో లేరు. చిన్న వయస్సులోనే గ్రామాన్ని విడిచి అడవిలోకి వెళ్లిన వెంకటయ్య 35 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండడంతో ఆయన రాక కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
35 ఏళ్ల తర్వాత
గ్రామానికి వస్తున్న వెంకటయ్య