విధులకు ఎగనామం | - | Sakshi
Sakshi News home page

విధులకు ఎగనామం

Aug 1 2025 2:45 PM | Updated on Aug 1 2025 2:45 PM

విధులకు ఎగనామం

విధులకు ఎగనామం

పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరు ●
● ముఖ హాజరుతో మాయాజాలం ● విధులకు రాకుండానే హాజరైనట్లు నమోదు ● అడ్డంగా దొరికిన 70 మంది ● నోటీసులు జారీచేయాలంటూ కలెక్టర్‌ ఆదేశాలు

సాక్షి, సిద్దిపేట: కొందరు పంచాయతీ కార్యదర్శులు ముఖహాజరుతో మాయాజాలం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. లొకేషన్‌లో ఫొటో తీసినట్లు అటెండెన్స్‌ వేసుకుంటూ గ్రామ పంచాయతీకి వెళ్లకుండానే ఊర్లు.. ఫంక్షన్లకు వెళ్తున్నారు. ఇలా ఫేక్‌ అటెండెన్స్‌ వేస్తూ కొందరు అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, గ్రామాల్లో సేవలు అందించేందుకు, డుమ్మాలకు చెక్‌ పెట్టేందుకు పంచాయతీ శాఖ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వాన్నే తప్పుదారి పట్టించి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ వేశారు. గురువారం వారిని గుర్తించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ హైమావతి ఆదేశించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందాలంటే కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టవద్దు. ఉద్యోగులు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారి నివాసాలు పట్టణాల్లో ఉండటంతో సమయపాలన పాటించడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. విధులకు హాజరుకావడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను పంచాయతీ శాఖ తీసుకవచ్చింది. 8 నెలలుగా అమలు చేస్తున్నారు. కార్యదర్శులు విధులు నిర్వర్తించే గ్రామంలో లొకేషన్‌కు వెళ్లి ఫోటో తీసి పంచాయతీ యాప్‌లో నమోదు చేసి అటెండెన్స్‌ వేసుకోవాలి.

ఫేక్‌ అటెండెన్స్‌

జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలుండగా 470 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురు పంచాయతీ కార్యదర్శులకు మరో గ్రామ పంచాయతీ సైతం ఇన్‌చార్జి కేటాయించారు. వీరు ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు గ్రామ పంచాయతీకి చేరుకుని ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ను ఫొన్‌లో వేసుకోవాలి. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టి.. గ్రామ పంచాయతీ సిబ్బందికి యాప్‌ లాగిన్‌ను ఇచ్చి ఫొటోతో.. ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. 8 నెలలుగా పలువురు ఇదే విధంగా హజరు వేసుకుంటూ డుమ్మా కొడుతున్నారు. బుధవారం నుంచి డీపీఓలకు ప్రత్యేక లాగిన్‌ను ఇచ్చారు. దీంతో యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ఫొటో వ్యక్తిదేనా.. నేరుగా దిగి అప్‌లోడ్‌ చేశారా.. ఫొటోను ఫొటో తీసి అప్‌లోడ్‌ చేశారా? అని పరిశీలించాలని డీపీఓలకు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా డీపీఓ నేతృత్వంలో పరిశీలించగా ఫేక్‌ అటెండెన్స్‌ వేస్తురని తేటతెల్లమైంది. 70 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. ఆ పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్‌ ఆమోదంతో నోటీసులను గురువారం రాత్రి డీపీఓ జారీ చేశారు.

నోటీసులు జారీ చేస్తున్నాం

విధులకు హాజరు కాకుండా నకిలీ అటెండెన్స్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను గుర్తించాం. వారికి కలెక్టర్‌ అనుమతితో నోటీసులు జారీ చేస్తున్నాం. ఉన్నత అధికారుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం.

–దేవకి దేవి, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement