
కొనలేం.. కొట్టలేం
బెంబేలెత్తిస్తున్న టెంకాయ ధరలు
● రూ.45 పలుకుతున్న కొబ్బరికాయ ● పండుగల నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలు ● ఏపీలో ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు ● నారికేళం బాటలోనే కొబ్బరి బోండాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పవిత్ర కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పూజ కార్యక్రమాలలో కొబ్బరి కాయలను విరివిగా వినియోగిస్తారు. ఎన్నో పవిత్రమైన విశిష్టతలు కల్గిన టెంకాయ ధర రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం.. ప్రతి ఇంటిలో, ఆలయాలలోని పూజ కార్యక్రమాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. గతేడాది ఇదే సమయంలో టెంకాయ ధర రూ. 30 వరకు ఉండగా, నేడు రూ.45 వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరికాయలు వస్తుంటాయి. జిల్లాలో యాభై వరకు కొబ్బరికాయల హోల్‌సెల్ విక్రయాల దుకాణాలు ఉన్నాయి. రోజూ లారీలతో పాటు ఇతర చిన్న వాహనాలలో కొబ్బరి కాయలు వస్తుంటాయి. ఈ హోల్‌సెల్ దుకాణాలను అధికంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే నిర్వహిస్తున్నారు.
ఉత్పత్తి తగ్గడమే కారణం
వాతావరణం, అక్కడి పంటల సాగులో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఏపీలో కొబ్బరికాయల ఉత్పతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగమతి చేసుకుంటున్నారు. సరుకు వాహనాల కిరాయి, హమాలీల కూలీలు కలుపుకుని కొబ్బరికాయల విక్రయాల ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో ధరలు మరింత ప్రియం అవుతున్నాయి.
కొబ్బరి బోండాలు సైతం..
కొబ్బరి కాయల బాటలోనే కొబ్బరి బోండాల ధరలు పరుగులు తీస్తున్నాయి. కొబ్బరిబోండాలు ధరలు రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. అదేవిధంగా కొబ్బరి నీరు లీటరుకు రూ.150 నుంచి ఆ పైన ధర పలుకుతుంది. కొబ్బరి నీరు రోగులతో పాటుగా, వృద్ధులు, చిన్నారులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది.
ధరలు బాగా పెరిగాయి
కొబ్బరి కాయల ధరలు బాగా పెరిగాయి. ఒక్కొక్కటి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. శ్రావణమాసం పూర్తయ్యే వరకు రోజు పూజలలో కొబ్బరికాయాల వినియోగం అధికంగా ఉంటాయి. రానున్న రోజుల్లో పెద్ద పండుగలు ఉన్నాయి. ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
– మహిళ, సిద్దిపేట
ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే..
కొబ్బరి కాయల ఉత్పత్తి గతంలో కంటే బాగా తగ్గింది. ముఖ్యంగా ఏపీ నుంచి దిగుమతి అవుతాయి. కానీ అక్కడ వివిధ కారణాలతో ఉత్పత్తి తగ్గడంతో తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగుమతి చేసుకుంటున్నాం. అందువలన రవాణా, కూలీల చార్జీలు పెరగడంతో ధరలు పెరిగాయి.
–శ్రీనివాస్, కొబ్బరికాయల హోల్‌సేల్ వ్యాపారి, సిద్దిపేట