డైట్‌ మెనూ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

డైట్‌ మెనూ తప్పనిసరి

Aug 1 2025 2:45 PM | Updated on Aug 1 2025 2:45 PM

డైట్‌ మెనూ తప్పనిసరి

డైట్‌ మెనూ తప్పనిసరి

● పాటించకుంటే కఠిన చర్యలు ● కలెక్టర్‌ హైమావతి ● పుల్లూరు జెడ్పీ స్కూల్‌ సందర్శన

సిద్దిపేటరూరల్‌: ప్రభుత్వ బడుల్లో డైట్‌ మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హైమావతి నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డైట్‌ ప్రకారం గురువారం బగారా అన్నం, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కూరను వండాల్సి ఉండగా సాధారణ అన్నం మిల్‌మేకర్‌ కూర, చింతపులుపు చారు వండడాన్ని గమనించారు. 95 మంది విద్యార్థులకు ఏడు కిలోల కూరగాయలు బదులు, తక్కువ శాతం కూరగాయలతో వండటంతో కలెక్టర్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తప్పకుండా డైట్‌ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని ఇన్‌చార్జి హెచ్‌ఎంను ఆదేశించారు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు

చిన్నకోడూరు(సిద్దిపేట): వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదని, వైద్య సిబ్బంది అంకిత భావంతో సేవలందించాలని కలెక్టర్‌ హైమావతి అన్నారు. గురువారం చిన్నకోడూరు పీహెచ్‌సీని, తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ల్యాబ్‌లో ఎక్కువగా ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాల ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఎరువుల సరఫరా రికార్డులు పరిశీలించారు. సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ సదానందం, ఎంపీడీఓ జనార్దన్‌, తహసీల్దార్‌ సలీమ్‌, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

వాహనదారుల భద్రత ముఖ్యం

సిద్దిపేటరూరల్‌: వాహనదారుల భద్రత ఎంతో ముఖ్యమని, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హైమావతి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో రోడ్డు భద్రత కమిటీతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజీవ్‌ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి, నివా రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కావాల్సిన వాటికి ఎస్టిమేట్‌ వేసి డాక్యుమెంట్లను తన వద్దకు తీసుకురావాలని ఆర్‌అండ్‌బి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనవసర మలుపులను మూసివేయాలని, సురక్షిత రవాణాకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు, అర్‌అండ్‌బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement