
సబ్ కోర్టు ఏర్పాటుకు ముందడుగు
హుస్నాబాద్: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. గత నెలలో న్యాయ కార్యదర్శి ప్రభుత్వ తరపున హైకోర్టుకు లేఖ రాసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ చైర్మన్ పొన్నం అశోక్ మంగళవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. చిరకాల కల అయిన సబ్ కోర్టు ఏర్పాటుకు బార్ అసోసియేషన్ సభ్యులు సమష్టి కృషి చేశారు. ఈ విషయంలో మంత్రి పొన్నం చొరవ చూపడంపై బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరు
గజ్వేల్: పట్టణానికి స్పెషల్ జ్యుడీషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరయ్యింది. కోర్టును మంజూరు చేయాలంటూ స్థానిక బార్ అసోసియేషన్ కొంత కాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం నగరంలో న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పండరి, ఏజీపీ కిరణ్‌సాగర్‌రావు, న్యాయవాదులు పార్థసారధిరాజు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
చట్టాలు అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్
బెజ్జంకి(సిద్దిపేట): చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా వాటిని అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బెజ్జంకిలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత చట్టంపైన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు లబ్ధి చేకూరేలా చట్టాలు, బాధ్యతలు వివరించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహరం అందించాలన్నారు. రేషన్ అర్హులందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు సమకూర్చుకునేందుకు తన వంతు సహాయంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంతరెడ్డి, ఫుడ్ సెక్యురిటీ అధికారి జయరాం పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్‌రెడ్డి
హుస్నాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు ఆగస్టు 15లోగా పరిష్కరించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయకుంటే సెప్టెంబర్ 1న వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమిస్తామన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న జెడ్పీ జీపీఎఫ్ సరెండర్ బిల్లులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్‌లో ఉంచడం శోచనీయమన్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వర్తించే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, హుస్నాబాద్ మండల శాఖ అద్యక్షుడు తిరుపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

సబ్ కోర్టు ఏర్పాటుకు ముందడుగు

సబ్ కోర్టు ఏర్పాటుకు ముందడుగు