
విధులు నిర్వర్తించని డాక్టర్లపై చర్యలు
● సమయపాలన తప్పనిసరి ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: విధులు నిర్వర్తించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా, మండల, వైద్యారోగ్య శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయానికి ఆస్పత్రికి రావాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు మరింతగా మెరుగు పరచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా కేసులు వస్తే ఆ ప్రాంతం చుట్టూ ఫాగింగ్ చేయాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే వివరాలను సేకరించాలన్నారు. ఆస్పత్రుల్లో సీసీకెమెరా, బయోమెట్రిక్ అమలు చేసేలా చూడాలని డీఎంహెచ్‌ఓకు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ధనరాజ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి పక్కాగా చేపట్టాలి
కొండపాక(గజ్వేల్): భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతిని పక్కాగా చేపట్టాలని, పారదర్శకత లోపించవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని సమీకృత మండల సముదాయ కార్యాలయ సముదాయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయాల పనితీరును పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలుపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల్లో ప్రత్యేక దృష్టి సారించి వేగిరం చేయాలన్నారు. బెజ్జంకిలో ఆకస్మిక తనిఖీలు
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి, గుండారం గ్రామాలలో కలెక్టర్ హైమావతి శుక్రవారం ఆకస్మిక పర్యటించారు. బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా స్టాఫ్ నర్స్‌తో పాటు అటెండర్ మాత్రమే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో రాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేసినా, పరిశుభ్రంగా లేకపోయినా సహించేది లేదని హెచ్చరించారు. ఆగ్రోస్ కేంద్రంలో తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుండారంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.