
పట్టు పెంచుదాం..
పట్టు ఉత్పత్తిలో జిల్లాకు మరోసారి గుర్తింపు వచ్చింది. 2030 నాటికి ప్రపంచంలోనే మన దేశం నంబర్ వన్ స్థానానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘నా పట్టు... నా గర్వం’ (మేరా రేషమ్.. మేరా అభిమాన్) అనే వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు దేశ వ్యాప్తంగా 128 జిల్లాలను ఎంపిక చేయగా అందులో సిద్దిపేట జిల్లా ఉండటం విశేషం. – సాక్షి, సిద్దిపేట
పట్టు ఉత్పత్తిలో దేశం రెండో స్థానంలో ఉన్నా.. వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లాలో పట్టు అధికంగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో బనారస్, కశ్మీరీ వస్త్రాలు, బలుచారి కంజీవరం, మైసూర్, గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి లాంటి చీరలకు వాడేది మన జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టుదారమే.
మన పట్టు.. నాణ్యమైంది
రాష్ట్రం భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ప్రాంతంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు పట్టు ఉత్పత్తికి అనుకూలం. 2019–20కి గాను దేశంలోనే అత్యంత నాణ్యమైన బైవోల్టన్ పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణకు కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది. మొదట పట్టు పురుగుల పెంపకం ఐదు దశలుగా ఉండేవి. వీటిని మొత్తం రైతులే నిర్వహించేవారు. ఇప్పుడు మొదటి రెండు దశలను చాకీ కేంద్రం పెంచుతోంది. మరో మూడు దశలు రైతులే పెంచుతున్నారు. దీని వలన పంట నాణ్యత పెరగడమే కాకుండా పంటకాలం కూడా తగ్గింది. గతంలో క్రాస్ బ్రీడ్ రకం పెంచేవారు. కానీ ఇప్పుడు జన్యు మార్పిడి చెందిన బైవోల్టన్ రకం వచ్చింది. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇవే కాకుండా మల్బరీ సాగు రకాలు కూడా జన్యు మార్పిడి ఆధునికతతో అత్యధిక ఆకుల దిగుబడి వస్తుంది. దీంతో గతంతో పోలిస్తే పట్టుసాగులో చాలా మార్పులు వచ్చి లాభదాయకంగా మారింది.
ప్రత్యేక యాప్‌లో వివరాల సేకరణ
జూలైలో వివిధ కార్యక్రమాలు చేపట్టగా, ఆగస్టు, సెప్టెంబర్‌లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో బేస్‌లైన్ సర్వేలో రైతులను కలిసి వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖకు చెందిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. రైతులు ఎలాంటి సాయం కోరుతున్నారు? మార్కెట్ ధరలు, సాగులో ఇంకా టెక్నాలజీ కావాలంటున్నారా? అనేది తెలుసుకుంటున్నారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. కొత్త రైతులు పట్టు ఉత్పత్తి వైపు మళ్లించేందుకు అవగాహన కల్పించనున్నారు. ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మల్బరీ సాగు పెంచేందుకు కృషి చేయనున్నారు.
త్వరలో అవగాహన సదస్సులు
కేంద్ర ప్రభుత్వం ‘నా పట్టు.... నా గర్వం’ అనే నినాదంతో పట్టు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. త్వరలో జిల్లాలో అవగాహన సదస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పట్టు ఉత్పత్తితో రైతులకు అధిక ఆదాయం వస్తుంది.
– వినోద్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త,ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం
దేశంలోనే కీర్తి సాధిద్దాం
‘నా పట్టు.. నా గర్వం’ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం
దేశ వ్యాప్తంగా సిద్దిపేటకు ప్రత్యేక స్థానం
సెప్టెంబర్ వరకు కొనసాగనున్నకార్యక్రమాలు
జిల్లాలో 1,500 ఎకరాల్లోమల్బరీ సాగు లక్ష్యం
జిల్లాలో వంద టన్నుల ఉత్పత్తి
రాష్ట్రంలో 17వేల ఎకరాల్లో సాగు అవుతుండగా అధికంగా మన జిల్లాలోనే సాగవుతోంది. జిల్లాలో 1,216 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తుండగా 100 టన్నుల పట్టుల ఉత్పత్తి అవుతోంది. చిన్నకోడూరు, బెజ్జంకి, కొండపాక, తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్, కొమురవెల్లి హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల, జగదేవ్‌పూర్, గజ్వేల్, మర్కూక్, మిరుదొడ్డి, దౌల్తాబాద్, దుబ్బాక, నారాయణరావుపేట్ మండలాల్లో రైతులు పట్టు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 1,216 ఎకరాల నుంచి 1,500లకు పెంచేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సిద్దిపేటకు ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వినోద్ కుమార్‌ను ఇన్‌చార్జీలుగా నియమించారు.

పట్టు పెంచుదాం..

పట్టు పెంచుదాం..