
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం: సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గత నెలలో 94 మంది చిన్నారులను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌ను పోలీసు అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న 27 మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.
చదువుతోనే గుర్తింపు
ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని, చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, కళాశాల పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నిర్వహిస్తున్న తరగతులపై, కళాశాలలో వసతుల గురించి, ఎంసెట్, నీట్ ఆన్‌లైన్ క్లాసులు జరుగుతన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో అడ్మిషన్‌ల సంఖ్య పెంచడానికి అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు.
పంచాయతీ కార్యదర్శికి షోకాజ్
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితకు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి షోకాజ్ నోటీసు అందించారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో దేవకీదేవి ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి అనితకు షోకాజ్ జారీ చేశారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె, భూంపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ జానకి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు ర్యాకం మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు.
రన్నింగ్ పోటీలకు
గజ్వేల్ విద్యార్థి ఎంపిక
గజ్వేల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జ్ఞానేశ్వర్ రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3న ఈ పోటీలు హనుమకొండలో జరగనున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబరిచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శుక్రవారం స్థానిక కళాశాలలో ప్రిన్సిపాల్ నిఖత్, స్పోర్ట్స్ ఇన్‌చార్జి డాక్టర్ మహేందర్‌రెడ్డిలు జ్ఞానేశ్వర్‌కు అభినందనలు తెలిపారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం: సీపీ అనురాధ