
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ హైమావతి ● నంగునూరు మండలంలో విస్తృత పర్యటన
నంగునూరు(సిద్దిపేట): విధుల పట్ల నిర్లక్ష్యం మహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. గురువారం నంగునూరులో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్‌సీ సెంటర్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పశువైద్యశాల, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కేనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, మొయతుమ్మెద వాగును పరిశీలించి ఇంటికి అవసరమయ్యే ఇసుకను వాగు నుంచి లబ్ధిదారులకు అందజేయాలని తహసీల్దార్ సరితను ఆదేశించారు. నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్ గదికి తాళం వేయడంతో డైరెక్టర్‌కు ఫోన్ చేసి వైద్యుడు రెగ్యులర్‌గా వచ్చేలా చూడాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు నిత్యం ఆస్పత్రిని తనఖి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా ప్రారంభించి బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
పశువుల ఆస్పత్రి పరిశీలన
నంగునూరులో శిథిలావస్థకు చేరిన పశువుల ఆస్పత్రిని కలెక్టర్ పరిశీలించారు. మండలంలో పశువుల సంఖ్య, క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారా? అని ఆరా తీసి వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.