
ఎకరాకు ఒకటే బస్తా
● కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు ● ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు ● జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి
గజ్వేల్: కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు మారింది. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు ఆధారంగా ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇది కూడా స్టాకు తక్కువగా ఉంటే నాలుగైదు ఎకరాల భూమి రైతుకు కూడా ఒకటి, రెండు బస్తాలను ఇచ్చి పంపుతున్నారు. జిల్లాలోని అన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొనగా..యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరుతున్నారు.
జిల్లాలో వరి సాగు క్రమంగా ఊపందుకుంటోంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 3లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. మరోవైపు పంటలు సాగు పెరిగే కొద్దీ యూరియా వాడకం పెరుగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్ మొత్తానికి 35,144 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. 10వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతోంది. నిజానికి గతంలో వానాకాలం సీజన్ అవసరాలకు యూరియా 80శాతంవరకు ముందుగానే స్టాకు వచ్చేది. జూలై చివరివారం, ఆగస్టు నెల వరకు పూర్తిస్థాయి నిల్వలు అందుబాటులో ఉండేవి.
వాడకాన్ని తగ్గించడంపై దృష్టి
రైతులు ఎకరా వరికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడుతారు. ఇలా పంట పూర్తయ్యేంతవరకు 6నుంచి 8బస్తాలను వాడతారు. కానీ ఎకరాకు ఒక దఫాలో ఒకే బస్తా సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంట పూర్తయ్యేంతవరకు 2 బస్తాలు వేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
అన్ని చోట్ల క్యూలైన్లు
యూరియా పంపిణీ సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్నిచోట్ల క్యూలైన్లు కనిపించాయి. ఎకరాకు ఒకటే బస్తా పంపిణీ జరిగింది. చాలా చోట్ల నాలుగైదు ఎకరాలున్న రైతులకూ రెండు, మూడు కంటే ఎక్కువ బస్తాలు దొరకలేదు. గజ్వేల్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నియోజకవర్గఇన్‌చార్జి నిరసన తెలిపారు.
అధికంగా వాడితే అనర్థమే
యూరియా కొరత లేదని వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ మోతాదుకు మించి వాడటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు.