
సాహితీ సౌరభం సినారె
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలుగు సాహిత్యం అభివృద్ధిలో సింగిరెడ్డి నారాయణరెడ్డి చేసిన కృషి ఎనలేనిదని ప్రముఖ పద్య కవి కనకయ్య, గ్రంథ పాలకులు దాసరి రాజు అన్నారు. డాక్టర్ నారాయణరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సినారె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ నారాయణరెడ్డి రచనలు నేటి యువ కవులకు ఆదర్శమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి, పలు ప్రక్రియలలో రచనలు చేశారన్నారు. జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య పురస్కారం లాంటి ఎన్నో అవార్డులతో పాటు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన డాక్టర్ నారాయణరెడ్డి తెలుగు సాహితీ జగత్తులో ఒక వెలుగు వెలిగారన్నారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, రాజ్‌కుమార్, పర్శరాములు పాల్గొన్నారు.