
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం
● గత బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్‌కార్డూ ఇవ్వలేదు ● పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్‌కార్డులిచ్చాం ● సొంతింటి కలనూ నెరవేరుస్తున్నాం ● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సిద్దిపేటజోన్: ‘మాది ప్రజా ప్రభుత్వం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సంక్షేమ పథకాలు ఆపడంలేదు’ అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, రూరల్ మండల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్ కార్డులు ఇచ్చి వారి కలను నిజం చేశామన్నారు. అలాగే పేదల సొంతింటి కలను సైతం నెరవేరుస్తున్నామని వివేక్ అన్నారు. సిద్దిపేట అర్బన్, రూరల్ పరిధిలో కొత్తగా 10వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌కు అధికంగా నిధుల కేటాయించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
పరస్పర నినాదాలు..
రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు అనుగుణంగా నినాదాలు చేశారు. పెద్ద రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ సదానందం, కాంగ్రెస్ నాయకుడు హరికృష్ణ అధికారులు పాల్గొన్నారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
నంగునూరు(సిద్దిపేట): రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు పెంచిన ఘనత రేవంత్ సర్కారుదేనని, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం నంగునూరులో 3,302 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డుల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ డిసెంబర్‌లోపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించి, మూడేళ్లలో మరో లక్ష ఉద్యోగాలిస్తామన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో సంక్షేమం నిర్వీర్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి.. రాష్ట్రా న్ని అప్పుల పాలు చేసిందని మంత్రి వివేక్ అన్నారు. చిన్నకోడూరులో నూతన రేషన్ కార్డు ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందన్నారు.
సిద్దిపేటరూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రేషన్‌కార్డుల ప్రొసీడింగ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న గడ్డం వెంకటస్వామి మూడు సార్లు ఎంపీగా పనిచేసి, 1973లో కేంద్ర మంత్రిగా ఉంటూ రేషన్‌కార్డు పద్ధతిని తీసుకువచ్చారని’ గుర్తు చేశారు. ఆయన వారసుడిగా తానూ రేషన్‌కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రేషన్‌కార్డుల ద్వారా సరాఫరా చేసే సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామన్నారు.