సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 59 వినతులు వచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి డివిజన్‌లో 16, నారాయణఖేడ్‌లో 8, జహీరాబాద్‌లో 1 వినతి అందగా, కలెక్టరేట్‌లో 34, అందోల్ డివిజన్‌లో ఎలాంటి వినతులు అందలేదని అధికారులు వెల్లడించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఇండి కూటమి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమ వారం విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇండి కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ నెల 25న సిద్దిపేటలో భారీ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా పాదయాత్రలో ముఖ్యఅతిథిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి ఢిల్లీ నుంచి మధ్యా హ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయానికి వస్తారన్నారు. మధ్యా హ్నం ఒంటిగంటకు డిగ్రీ కళాశాల మైదానం నుంచి విక్టరీ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
హవేళిఘణాపూర్(మెదక్): కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సీపీఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, బాలమణి, మహేందర్‌రెడ్డి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కళ్లాల్లో ధాన్యం..
కళ్లల్లో దైన్యం
అల్లాదుర్గం(మెదక్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నా కొనేవారే దిక్కులేరు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రైతులు కల్లాలు చేసే 15 రోజులు గడిచింది. స్థానిక రైతు కేంద్రం, పాఠశాల ఆవరణలో ధాన్యం నిల్వ చేశారు. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా అల్లాదుర్గంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరించారు. ఈసారి మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. మూడేళ్ల క్రితం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చేశారు. వారు సైతం కేంద్రం ఏర్పాటుకు ముందుకు రాలేదు. రోజూ ధాన్యం ఆరబోస్తూ కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.


